కొరిలేషన్ కథ (జూన్, జూలై సిలబస్)
ఒక అడవిలో ఒక ప్రదేశంలో మూడు మామిడి చెట్లు ఒకే వరుసలో ఉన్నాయి. మొదటి చెట్టు క్రింద బొరియలో ఒక కుందేలు నివసిస్తోంది. రెండవ చెట్టు క్రింద ఒక ఉడత ఉంటోంది. మూడవ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుంది. గూటిలో నిద్రపోయి రోజూ ఒక కల కంటుంది. (నల్లబల్లపై మూడు చెట్లు, వాటికి ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ ఉన్న మామిడిపళ్ళు వెయ్యాలి)
మొదటి చెట్టు బొరియలో ఉంటున్న కుందేలు ఒక రోజు కొన్ని క్యారెట్లు తెచ్చుకుంది. (కుందేలు ఎదురుగా కొన్ని క్యారెట్లు వెయ్యాలి. వాటిని లెక్కించమనాలి) క్యారెట్లు అన్నీ తినేయగా ఒక క్యారెట్టు మిగిలితే, కుందేలు దాచుకుంది. (ఇపుడు క్యారెట్లు అన్నీ చెరిపెయ్యాలి)
రెండవ చెట్టు క్రింద ఉన్న ఉడత ఎప్పుడూ చెట్టు ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. ఎక్కిన ప్రతి సారీ ఒక మామిడి పండు తీసుకొస్తూ ఉంటుంది. పండుకున్న అక్షరాన్ని కుందేలుకు చెప్తూ ఉంటుంది. (రెండవ చెట్టు మామిడి పళ్ళపై A,B,C,D,E,F,G,H,I,J ఆల్ఫబెట్స్, మూడవ చెట్టు మామిడి పళ్ళపై వాటి స్మాల్ లెటర్స్ రాయాలి) ఆ రోజు ఉడత కొన్ని ఉలవలు తిన్నది. (ఉలవలను లెక్కించాలి. తర్వాత చెరిపెయ్యాలి)
మూడవ చెట్టు మీద ఉన్న పిచ్చుక స్మాల్ లెటర్స్ రాసి ఉన్న మామిడి పళ్ళను క్రింద పడేస్తూ ఉంటుంది. ఆ పళ్ళు ఉడత తీసుకుంటూ ఉంటుంది.
ఒక రోజు ఉడతకు క్యారెట్ తినాలని అనిపించింది. కుందేలును అడిగింది.
“నేను చెప్పిన పని చేస్తే నీకు క్యారెట్ ఇస్తాను” అంది
“ఏమి చెయ్యాలి?” అడిగింది ఉడత.
“మూడు మామిడి చెట్ల మీద క్రింద నుండి పై వరకూ పది సార్లు ఎక్కి దిగాలి.” అంది కుందేలు.
“సరే” అని తల ఊపింది ఉడత.
మొదటి చెట్టు మీద క్రిందికి పైకి పది సార్లు ఎక్కి, దిగింది.( పిల్లలు ఇపుడు నంబర్స్ లెక్క పెట్టాలి)
రెండో చెట్టు మీద క్రిందికి పైకి పది సార్లు ఎక్కి, దిగింది.(పిల్లలు ఇపుడు 11 నుండి 20 వరకూ లెక్కించాలి)
మూడో చెట్టు మీద క్రిందికి పైకి పది సార్లు ఎక్కి, దిగింది.(పిల్లలు ఇపుడు 21 నుండి 30 వరకూ లెక్కించాలి)
ఉడత ఒక పలక, బలపం తీసుకుని 1 నుండి 30 వరకూ నంబర్స్ రాసింది.
“నువ్వు చెప్పిన పని చేసాను కదా, క్యారెట్ ఇవ్వు” అని అడిగింది ఉడత.
నా దగ్గర ఉన్న ఒక్క క్యారెట్ మూడో మామిడి చెట్టు మీద ఉన్న పిచ్చుక దగ్గర ఉంది. వెళ్లి తీసుకో” అంది కుందేలు.
ఉడత వెళ్లి మూడో మామిడి చెట్టు క్రింద నిలుచుని పిచ్చుకను క్యారెట్ అడిగింది.
“నేను క్రింద విసిరిన స్మాల్ లెటర్స్ మామిడి పళ్ళని, రెండో చెట్టు నుండి నువ్వు కోసిన క్యాపిటల్ లెటర్స్ మామిడి పళ్ళతో సరిగ్గా జతపరిస్తే నీకు క్యారెట్ ఇస్తాను” అంది పిచ్చుక.
ఉడతకు భలే సరదాగా అనిపించింది. పిచ్చుక చెప్పిన పని చేసింది. అన్ని లెటర్స్ సరిగ్గా జతపరచి చూపించింది.( ఇపుడు మామిడి పళ్ళపై లెటర్స్ రాసిన ఫ్లాష్ కార్డ్స్ బులెటిన్ బోర్డ్ లో అమర్చి ఒక్కో విద్యార్థి ఉడత బొమ్మ పట్టుకుని, తనే ఉడత అయినట్టు ఒక్కొక్కరు ఒక్కో లెటర్ ని జత పరచాలి.)
“నువ్వు చెప్పిన పని చేసాను కదా...మరి నాకు క్యారెట్ ఇవ్వు” అని అడిగింది ఉడత.
పిచ్చుక పకపక నవ్వి, ఉడతను మెచ్చుకుని తన గూటిలో దాచిన క్యారెట్ ను క్రిందికి విసిరింది.
ఉడత సంతోషంగా క్యారెట్ తిన్నది. ఉడతకు బోలెడు బలం వచ్చింది.
కొన్ని రోజుల్లో మామిడి పళ్ళు అన్నీ తినేశాయి.
తర్వాత మామిడి టెంకలను మట్టిలో నాటాయి. క్రొత్త మొక్కలు వచ్చి, బాగా ఎదిగాయి. అడవి అంతా మొక్కలు పెరగడం వల్ల వర్షాలు బాగా పడ్డాయి. అప్పుడు కుందేలు, ఉడత, చిలుక ఈ పాటను పాడాయి....అప్పుడే అక్కడికి వచ్చిన కోతి తబల వాయించింది.
“వర్షం వర్షం మళ్ళీ రా...
మొక్కలు బాగా ఎదగాలి...
వర్షం వర్షం మళ్ళీ రా....
మేము బాగా గెంతాలి...
వర్షం వర్షం మళ్ళీ రా...
మేము పడవలు చేసి వదలాలి
వర్షం వర్షం మళ్ళీ రా...
కడవలో నీటిని నింపాలి...
వర్షం వర్షం మళ్ళీ రా...
వలలో చేపలు పట్టాలి”
మామిడి చెట్లన్నీ పెద్దవి అయ్యి పండ్లు కాసినపుడు మళ్ళీ ఇలా పాడాయి...
“విత్తనం ఒకటే...
చెట్టు ఒకటే...
పండ్లు మాత్రం పది...
భలే భలే
పండ్లు మాత్రం ఇరవై...
భలే భలే...
పండ్లు మాత్రం ముప్పై....
(ఇలా వంద వరకూ పదుల్లో చెప్పించాలి)
విత్తనం ఒకటే...
చెట్టు ఒకటే...
ఇచ్చే గాలికి లెక్కే లేదు...
భలే భలే...
ఇచ్చే కలపకి లెక్కే లేదు...
భలే భలే...
తెచ్చే వర్షానికి లెక్కే లేదు...
వర్షం వర్షం మళ్ళీ రా...
మొక్కలు చెట్లు అవ్వాలి...
వర్షం వర్షం మళ్ళీ రా...
అందరు హాయిగా బ్రతకాలి...”
(జూన్, జూలై సిలబస్ అయ్యాక ఈ కొరిలేషన్ కృత్యం చేయించాలి. ఈ కథ అన్ని సబ్జెక్ట్స్ నూ కవర్ చేస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం) self assessmentకు ఇక్కడ అవకాశం కుదురుతుంది. ఈ కథ జూలై నెల చివర్లో రెండు, మూడు సార్లు చేయించాలి.) కృత్యం పూర్తి అయ్యాక పిల్లలతో ఈ కథలో నీతి చెప్పించాలి- కలసి మెలసి ఉండాలి, సరదాగా ఆడుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలిి లాంటి నీతి పిల్లలే చెప్తారు. చివర్లో పిల్లలతో కాగితం పడవలు చేయించాలి, మామిడిపండు, పలక, పడవ, వల మొదలైన బొమ్మలు వేయించాలి. ఇక కొరిలేషన్ లో ఆరు సబ్జెక్ట్స్ పూర్తి అయినట్టే.
(పిల్లలు ఈ కథను అస్సలు మర్చిపోరు. కథ ద్వారా చెప్పిన ఏ విషయాన్నీ మర్చిపోరు. ఈ కృత్యం బాగా వచ్చిన తర్వాత ఇదే కథను నాటకం వేయించాలి)
Image may contain: one or more people, people sitting, table, child and indoor
Image may contain: 1 person
Image may contain: 2 people, table and indoor

కొరిలేషన్ కథ - Correlation Story

 
Heutagogy © 2015 - Blogger Templates Designed by Templateism.com