కొరిలేషన్ (పరస్పర సంబంధం) - కొరిలేట్ చేయడం వల్ల ఉపయోగాలు


నీరు అని చెప్పండి....
ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ నీటి చలనం గురించి చెప్తారు
ఒక కెమిస్ట్రీ టీచర్ హెచ్ టూ ఓ అంటారు
ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయులు నీటి అవసరాలను ఏకరువు పెడ్తారు
ఒక బయాలజీ టీచర్ అయితే మొక్కలకూ నీటికీ గల సంబంధాన్ని చెబుతారు
ఒక జూవాలజీ టీచర్ అయితే జంతువులకూ నీటికీ గల సంబంధాన్ని వివరిస్తారు.

మరి ఈ ఐదు అంశాలనూ క్రోడీకరించి చెప్పగలవారు ఎవరు? నిస్సందేహంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే!

అలాగే గ్రహాలు, గ్రహణాలు అనండి...
ఇదొక సోషల్ పాఠమని ఠకీమని జవాబు వస్తుంది. మరి ఈ పాఠ్యాంశంలో సైన్స్, గణితం లేవా? ఉన్నాయి. కానీ వాటిని మనం సంధానం చేయము. ఇలా గ్రహణాల గురించి చెబుతున్నపుడు చంద్ర/సూర్య గ్రహణం ఎన్నాళ్ళకోసారి ఏర్పడుతుందో చెబుతాం. అలా లెక్క కట్టడమెలాగో చెబుతాం. మరి అది గణితమే కదా! భూమి, సూర్యుడు, చంద్రుడు,మిగిలిన గ్రహాల గురించి బోధించడం సైన్స్, గ్రహణాలు ఏర్పడు విధానం గూర్చి చెప్పడం, వాటి చలనం గూర్చి బోధించడం సైన్స్. అలాగే వీటి పేర్లు చెప్పినపుడు అది భాష. మన తెలుగు పాఠాల్లో చూడండి, అన్ని పాఠ్యాంశాలూ ఉంటాయి. ఐదవ తరగతి గణితంలో గోల్కొండ కోట విహారయాత్ర పాఠం ఒక కథగా సాగుతూ గణితంలోని కనీసాభ్యసన స్థాయిలను పూర్తిచేయడం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కో అంశాన్నీ గనుక అనుసంధానం చేస్తూ పాఠ్యాంశ బోధన సాగితే ఎంత బావుంటుంది! పాఠ్యపుస్తకాల్లో వచ్చిన మార్పు వల్ల ఇపుడు ఉపాధ్యాయులకు ఈ విధానం ఇంకా సులువౌతుంది.

 అదెలా అంటారా?

మనం నేర్పే సైన్సును పర్యావరణ విజ్నానం అంటాం. ఇక్కడ మనకున్న చక్కటి వెసులుబాటు "కొరిలేషన్" (పరస్పర సంబంధం). సైన్స్ విభాగాలైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ లేదా జూవాలజీలు అన్నీ మన పాఠాల్లో ఉంటాయి. వాటిని విభజించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రయోగాన్ని చేయించినపుడు కానీ, ఒక ప్రాజెక్టు పని ఇచ్చినపుడు కానీ, అంతెందుకు, ఒక పాఠాన్ని బోధించినపుడు వీటన్నింటినీ కొరిలేట్ చేస్తూ చెప్పగలిగితే విద్యార్థుల గ్రహణ శక్తి మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా ఒక అంశాన్ని బోధించడం వలన భవిష్యత్తులో వారికి కన్ఫ్యూజన్ ఉండదు. సైన్స్ ప్రతి పాఠ్యాంశంతోనూ మమేకమైపోగల సబ్జెక్ట్. ఇది అందరూ ఒప్పుకుని తీరుతారు. చరిత్ర, భూగోళం,గణితం అన్నింటిలోనూ సైన్స్ ఉంటుంది. చరిత్ర చెప్పేటపుడు అప్పటి స్థితిగతుల్ని, వారి కట్టడాల గురించి, అప్పటి శాస్త్రసాంకేతికత, వ్యవసాయ విధానాలు, వాడిన లోహాలు మొదలైన వేటి గురించి చెప్పినా, సైన్సు చెప్పినట్లే కదా!

కొన్ని ఉదాహరణలు చూద్దాం:

నీరు- వ్యాసం మొదట్లో చెప్పినట్లు కాకుండా, నీటితో ప్రయోగాలు చేయించి, వాటిని నమోదు చేయించండి. నీటి చలనానికి వర్షం వచ్చిన రోజు బావుంటుంది. వర్షం నీరు పారుతున్న విధానాన్ని చూపండి. మర్నాడు నీరు ఎక్కడెక్కడ ఎలా చలిస్తుందో చెప్పమనండి. చూడండి పిల్లలు ఎన్ని జవాబులు చెప్తారో! నీటిలో ఏ ఏ వాయువులు ఉంటాయో చెప్పండి. పిల్లలతో చెప్పించండి. రెండు వాయువులు కలిసి ద్రవంగా ఎలా ఏర్పడిందో అడగండి. పాఠశాల, ఇళ్ళల్లో పెంచే మొక్కలకు నీటికీ గల సంబంధం ఏమిటో అడగండి. వారు ఏమనుకుంటున్నారో చెప్పమనండి/రాయమనండి. నీటిలో ఉండే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మనకు ఎలా లభిస్తాయో ప్రయోగం ద్వారా చూపండి. జంతువులకూ, మానవులకూ నీటి అవసరం ఏమిటో చర్చించమనండి. నీటితో భూమికున్న అవసరాలు ఏమిటో రాయమనండి. ఇక నీటి పొదుపు ఆవశ్యకత వివరించమనండి. ఇదంతా అయ్యాక, మట్టితో ఒక గ్రామాన్ని/అట్టలతో డయోరమా లాంటిదాన్ని తయారుచేయించండి. నీటి వనరులు ఆ నమూనాలో ఉండేలా చూడమనండి. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా తయారుచేస్తారు. తెలుసుకున్న అంశాలన్నీ అందులో పొందుపరుస్తారు. తర్వాతి రోజు ఒక పట్టిక తయారుచేసి, ప్రాజెక్టు పని ఇవ్వండి. తమ తమ ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాజెక్టు పనిని పూర్తి చేయమనండి. అంతే! నీటికి సంబంధించిన ఎన్నో విషయాలు వారు తెలుసుకున్నట్లే! ఇందులో ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ చెప్పేసినట్లే కదా!

ఇదొక ఉదాహరణ మాత్రమే! పాఠాన్ని ఒక ఫిక్స్ డ్ ఫ్రేమ్ వర్క్ లోనే బోధించాలని లేదనీ, మన సృజనాత్మకత పరుగులు పెట్టినపుడు పిల్లల సర్వతోముఖాభివృద్ధి తథ్యమని మనకు ఇట్టే అర్థమౌతుంది!

కొరిలేట్ చేయడం వల్ల ఉపయోగాలు:
  • శాస్త్రీయమైన ఆలోచనా విధానం అలవడుతుంది.
  • సమస్య సాధన దిశగా మెదడు వృద్ధి చెందుతుంది.
  • పిల్లల ఐక్యూ పెరుగుతుంది.
  • తార్కిక, హేతువాద దృక్పథాలు అలవడుతాయి.
  • ఉపకల్పనలు, ప్రాక్కల్పనలు విషయంలో పరీక్షించే స్థాయికి ఎదుగుతారు.
  • ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేయడం నేర్చుకుంటారు.
  • కనెక్టివిటీకి సంబంధించి ప్రతి సారీ ఆలోచిస్తారు.
  • సబ్జెక్టును నేర్చుకునే విధానంలో మార్పు వచ్చినపుడు వారి సంగ్రహణా విధానంలో కూడా మర్పు వస్తుంది. అభ్యసన మరింత సులువౌతుంది.
  • స్వయంగా కారణాలు, సంధానాలు చెప్పడం మొదలుపెడ్తారు. అలా చెప్పడమంటూ మొదలుపెడితే, ఇక మన కృషి ఫలించినట్లే!
  • ఇలా కొరిలేషన్ పద్ధతిలో పాఠ్యబోధన జరిగినపుడు అన్ని పాఠ్యాంశాల్లోనూ విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుంది. (విద్యాపరమైన ప్రయోగాల్లో ఈ విషయం నిరూపించబడింది)
  • పరిశీలన, అన్వేషణ మొదలగు ఎన్నో గుణాలు పిల్లల్లో వృద్ధి చెందుతాయి.
కొరిలేట్ చేయడానికి కావల్సినవి:
  • ఆధారము
  • ప్రయోగము
  • పాఠ్యాంశము
  • సాధన దిశగా విద్యార్థులను ప్రేరేపించాలి.
  • పాఠ్యాంశ బోధన ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకంగా రూపొందాలి.
కొన్ని కృత్యాలు:
  • ట్రాకింగ్ (జాడ కనిపెట్టుట)
  • శాస్త్రసాంకేతికత నిన్న నేడు పై చర్చ
  • వార్తాపత్రికల నుండి పిల్లల పేజీని సేకరించి, కృత్యాలు చేయించుట.
  • కథలు వ్రాయించుట.
  • ప్రాజెక్టు పనులు
  • వ్యక్తిగత పరిశోధనలు
  • పాఠ్యాంశాలను అనుసంధానం చేస్తూ కొన్ని నాటికలు వేయించవచ్చు. అలాగే కథలు వ్రాయించవచ్చు.
  • సైన్స్ ఫెయిర్స్ పెట్టినపుడు వట్టి సైన్స్ మాత్రమే కాక ఇతర పాఠ్యాంశాల అంశాలనూ, సైన్స్ తో వాటికి గల సంబంధాన్ని తెలిపే విధంగా ఫెయిర్ ఏర్పాటు చెయ్యాలి.
  • ఎగ్జిబిట్స్ తయారీ కూడా ఈ సూత్రాన్ని అనుసరించాలి.
ఇవి చేయండి:
  • సమాచార సేకరణకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి.
  • ప్రెడిక్షన్( ప్రతి విద్యార్థీ చాలా విషయాలు తనకు అర్థమైనట్లుగా చెప్పగలడు. ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తూ, కారణాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలి)
  • సీక్వెన్స్ (అనుక్రమం)- ముందుగా అనుకున్న విషయాన్ని చెప్పి/చేసి తదుపరి సంబంధిత అంశాలతో అనుసంధానం చేస్తూ చేయించడం/చెప్పించడం చేయాలి. అందువలన విద్యార్థుల్లో కన్ఫ్యొజన్ కు దారి ఉండదు. అంతే గాక ఒక పద్ధతితో చెప్పడం/చెయ్యడం అలవడుతుంది.
  • కంపేరిజన్(పోలిక) పోలికలు చెప్పించాలి.
  • ఈ విధానంలో తాము ఎందుకు పాఠ్యాంశాన్ని అభ్యసిస్తున్నామో విద్యార్థులకు తెలియాలి.
  • ఫ్యాక్ట్స్ (వాస్తవాలు) ప్రయోగం/ప్రాజెక్టు/నాటకం/కథ మొదలైనవి శాస్త్ర వాస్తవాలను తెలియజేయాలి.
పథకరచన:

ఇలా పాఠ్యబోధన జరగాలంటే ఉపాధ్యాయుని సంసిద్ధత చాలా ముఖ్యం.
అన్ని పాఠ్యాంశాలనూ ముందుగా అవగాహన చేసుకోవాలి.
కొరిలేట్ చేయదగ్గ అంశాలను కేటగొరైజ్ చెయ్యాలి.
తగిన బోధనాభ్యసన సామగ్రిని తయారుచేసుకోవాలి. ( నేను అప్పటికప్పుడు టి ఎల్ ఎమ్ తయారుచేస్తాను. అది కూడా విద్యార్థుల సహకారంతోనే! ఒక్కోసారి అవసరమైన సామాగ్రి తయారీని గ్రూపులకు హోం వర్కుగా ఇస్తాను. వారు ఆ సామాగ్రిని తయారుచేసి తీసుకురావాలంటే తగిన వనరులు సమకూర్చుకోవాలి, అలాగే టీం అంతా ఒకచోట చేరి ఆ చార్టు/నమూనా/బొమ్మ మొదలైనవి చేసి తీరాలి. ఇలా టీం వర్క్ పెంపొందుతుంది. వనరులను సమకూర్చుకోవడం తెలుస్తుంది.)

బోధనాభ్యసన ప్రక్రియ:

సీక్వెన్షియల్ పద్ధతిలో పాఠ్యబోధన చేయాల్సి ఉంటుంది. ఒక అంశానికి ఇతర అంశాలను జోడించి చెప్పేటపుడు చాలా ఆసక్తికరంగా బోధించాలి.
బోధన పూర్తయ్యాక అటువంటిదే ఒక అంశాన్ని పిల్లలకు హోం వర్క్ గానో లేదా పాఠశాలలోనే చేయదగ్గ కృత్యంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఈ పద్ధతి అలవాటు అవుతుంది. కనెక్టివిటీకి అలవాటుపడ్తారు.

సమకూర్చుకోవాల్సిన వనరులు:
  • తగిన బోధనాభ్యసన సామాగ్రి
  • పాఠశాల ఆవరణ
  • పర్యావరణ వినియోగం
  • చక్కటి డిస్ప్లే బోర్డు/ ఫ్లానెల్ బోర్డు
  • పిల్లల ఆసక్తి/ఉత్సాహం
  • ఒక నమోదు పుస్తకం
మూల్యాంకనం:
మూల్యాంకనానికి కూడా ఈ పద్ధతి ఉపయోగించవచ్చు.
ప్రాజెక్టు పనులు/ ప్రయోగాలు మొదలైనవి ఇవ్వచ్చు.
నమోదు చేసిన అన్వేషణలను తరగతి గదిలో గ్రూపు కృత్యంగా ప్రదర్శించనివ్వాలి. మిగిలిన గ్రూపులు ఆ నమోదును ప్రశ్నించాలి.

About the Author

Admin

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

 
Heutagogy © 2015 - Blogger Templates Designed by Templateism.com