ఈ సంవత్సరం కనీసం పది మంది పిల్లలతో కథలు రాయించాలి అని నా నిర్ణయం. విద్యా సంవత్సరం అంతా కథలు ఎక్కువగా చెప్తూ పోయాను. పిల్లలు చాలా enjoy చేసేవారు. వాళ్ళతో కథలు చెప్పించడం, నెలకు ఒక వర్క్ షాప్ నిర్వహించి, ఊరికే వారు విన్న కథలు చెప్పించడం, నేను కొన్ని కథలు అప్పటికప్పుడు రాసి చూపించడం చేసేదాన్ని. పిల్లలకు చాలా కథల పుస్తకాలు కొన్నాను. మధుసూదన్ సార్ పంపిన పుస్తకాలు బోలెడు ఉన్నాయి. బాలభారతం, తెలుగు వెలుగు ప్రతీ నెలా కొంటాను వీళ్ళ కోసం. వాళ్ళకు ఆ పుస్తకాలు అన్నీ చదివెయ్యాలని మహా ఆశ. చాలా మందికి చదవడం రాక మొదట్లో ఊరికే బొమ్మలు చూసేవారు. ఇపుడు చాలా మంది చదవడానికి పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్తున్నారు.
నిన్న “పిల్లల కథా రచన”కు మొదటి రోజు. ఏదో ఒక కథ అంటే ఎలా అల్లుతారో తెలియదు కదా...అందుకే చిన్న ప్రయోగం చేసాను. బడ్డీగాడి చిన్నప్పటి పుస్తకాలు చాలా వారకూ పాత స్కూల్ లోనే ఇచ్చేసాం. ఇంకా కొన్ని ఉండిపోయాయి. క్రొత్త మేజిక్ పాట్ పుస్తకాలు, చంపక్ పుస్తకాలు, జూనియర్ చందమామ పుస్తకాలు చింపడం ఇష్టం లేదు. అందుకే ఆ పాత పుస్తకాలలోని చిత్రాలు కట్ చేసాను. ఒక్కొక్కళ్ళకు ఒక్కో చిత్రం పంచేసాను నిన్న. ఆ చిత్రాలు చూసి, ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. చెప్పుకోనిచ్చాను. 


ఈ రోజు ఉదయం రెండో సెషన్లో డిజీ క్లాస్ తర్వాత కథా రచన మొదటి, రెండు విధానాలు అమలు చేసాను. ముందు పది నిముషాల పాటు తెదేకంగా ఎవరి చిత్రాన్ని వారు చూస్తూ ఉండాలి. అలాగే చేసారు. తర్వాత అందులో పాత్రలను గుర్తు పెట్టుకోవాలి. వీలయితే పాత్రలకు పేర్లు పెట్టుకోవాలి. అదీ జరిగింది. తర్వాత పది నిముషాలు కళ్ళు మూసుకుని తమ చిత్రానికి ఒక కథను ఊహించాలి. పది నిముషాల తర్వాత ఒక్కొక్కరిని పిలిచి, తమ చిత్రాన్ని ప్రదర్శించమని, అందుకు తగ్గ కథను చెప్పమని అడిగాను.
పిల్లల్లో ఎంత ఊహా శక్తి ఉంటుందో చక్కగా రుజువు చేసారు పిల్లలు. కథలు, గేయాలు, పాటలు కొన్ని నెలలుగా అలవాటు పడ్డారేమో....చక్కటి కథలు చెప్పారు. ఈ రోజు అంజలి, రాములమ్మ, రాము, ప్రియాంక తమ చిత్రాలకు తగ్గ కథలు చెప్పారు. వాటిలో అంజలి, ప్రియాంక చక్కటి కథలు అల్లారు.
అంజలికి సింహాసనంపై దిగులుగా కూర్చున్న సింహం, సింహం కు ఏదో చెబుతున్న నక్క చిత్రం వచ్చింది. ఆ చిత్రానికి ఎంత చక్కటి కథ అల్లిందో అంజలి. అలాగే ప్రియాంక కూడా తన చిత్రంలో ఉన్న రెండే పాత్రలు అయిన వేటగాడు, అడవి మనిషి పాత్రలతో చక్కటి కథ చెప్పింది. ఇవన్నీ ఇంకా బాగా రాయించి ఈ బుల్లి పిల్లల కథలను పుస్తకంగా వెయ్యాలి.

పిల్లలతో కథలు రాయించేందుకు చిన్న ప్రయోగం.



స్వీయ అభ్యసనం సులువే - లేత ఆకాశాలు - హ్యుటగాగి

 
Heutagogy © 2015 - Blogger Templates Designed by Templateism.com